Friday, January 27, 2012

మూడు 'బూతులు' ఆరు 'ద్వంద్వార్థాల'తో టాలీవుడ్ సినీ సాహిత్యం

Hot actress


సినిమా మాధ్యమం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కాదనలేని సత్యం. గతంలో కొన్ని సినిమాల వల్ల పిల్లలు....................................
మారినట్లు కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకునేవారు. అప్పటి సినిమాలు అలా ఉండేవి. అలా అని ఇప్పటి సినిమాలు లేవా? అంటే.. వున్నాయి. ఇప్పటి సినిమాలు కూడా పిల్లల్ని మార్చేస్తున్నాయి. తల్లిదండ్రుల్ని పేరు పెట్టి పిలవడం... తండ్రిని పిలవాలంటే.. 'మీ ఆయన..' అంటూ తల్లితో రకరకాలుగా సంభాషించడం.. తల్లి మురిసిపోవడం.... ఇదేదో కొత్తగా ఉందే... అనేలా యువతను ఆకట్టుకునేందుకు వెర్రి సంభాషణలు చోటుచేసుకున్నాయి.... ఇక కథలు కూడా అలానే ఉంటున్నాయి.... దానికితోడు సాహిత్యం అంతకంటే దరిద్రంగా తయారైంది.

ఒకప్పుడు సినిమా సాహిత్యం వింటే.. మళ్ళీ మళ్ళీ వినాలపించేది. సినిమాకు సాహిత్యం అనేది కీలకం... ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి... ఇలా ఎందరో మహామహులు తమ సాహిత్యాన్ని సినిమారంగానికి పరిచయం చేసి... మంచి సాహితీవేత్తలుగా కీర్తి పొందారు. నేడు అలాంటి సాహిత్యం.. రాసేవారిని వేళ్ళమీద లెక్కించవచ్చు.... ప్రస్తుతం ఉన్న వారిలో... జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి... వంటివారిని కొందరిని చెప్పుకోవచ్చు.

ఇక ఇటీవల కొత్తగా అడుగుపెట్టిన కొందరు రచయితలు దర్శకుల పల్స్‌, ప్రేక్షకుల పల్స్‌ తెలిసినట్లుగా పిచ్చి సాహిత్యంతో కొత్తపదాల్ని ముందుకు తెస్తున్నారు. తెలుగు భాషలో ఆంగ్లపదాలను కలిపేస్తూ... అదే గొప్ప సాహిత్యం అంటూ బిల్డప్‌ ఇస్తున్నారు.

సాహిత్యంలో విలువలు లేకపోయినా ప్రాస కోసం ప్రాకులాడుతూ.... ఇడియట్‌ నుంచి బిజినెస్‌మేన్‌ వరకు రకరాల సాహిత్యంతో సినిమా పాటలు ఇలా కూడా రాయవచ్చునా అనిపించేట్లుగా ఉంటున్నాయి మరి.

80వ దశకం వరకు.... థియేటర్‌లో తెర లేపడానికి ముందు ఏడుకొండలస్వామిపై గీతాలు వచ్చేవి. కొన్ని సినిమాల్లో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్ విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం... అంటూ శ్లోకాల రూపంలో పాటలు వచ్చేవి. ఇవి వింటే... కాస్త మంచి మాటలు విన్నామనే తృప్తికలిగేది. అయితే అప్పటి యువత ఆకట్టుకునేట్లు కూడా గిలిగింతలు పేట్టే పాటలూ లేకపోలేదు.
చిటపట చినుకులు పడుతుంటే...
చెలికాడే సరసన ఉంటే..
చెప్పలేని ఆ హాయి.. అంటూ పులకరింపచేసేసేవి.
ఇవికాకుండా... పరభాషా గాయకులు పాడితే సాహిత్యం కూడా దెబ్బతినేదికాదు. ఇందుకు మహ్మద్‌ రఫీ ఆలపించిన 'నా మది నిన్ను పిలిచింది గానమై... అంటూ కొత్త గాత్రంతో ఆకట్టుకునేవారు. కానీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తెలుగు పలకడం సరిగ్గారాని వారితో పాటలు పాడించడం ప్యాషన్‌ అయిపోయింది. దానికితోడు సంగీతం హోరు ఎక్కువైంది.

ఇటీవలే పాపులర్‌ అయిన 'నాకింకా పదహారే... నుంచి 'పిల్లా చావ్‌ చావ్‌....' వరకు రాసిన పాటల్లో నీతి కంటే బూతే ఎక్కువగా ఉంది. ఇటీవలే విడుదలైన శంకర్‌ 'స్నేహితుడు'లో విజయ్‌, ఇలియానా సాంగ్‌లో... ద్వంద్వార్థాలు విన్పిస్తాయి.

అడ్డదిడ్డంగా పోతున్నారు: దాసరి
ఇప్పటి సినిమాలు, సాహిత్యంపై ఇటీవలే డా|| దాసరినారాయణరావు వంటివారు కూడా దుయ్యబట్టారు. ఇప్పటి దర్శకనిర్మాతలకు అవగాహన లేదు. దానితో ఏదో ఒకటి తీసేస్తున్నారు. ముఖ్యంగా పూరీజగన్నాథ్‌, రామ్‌గోపాల్‌వర్మలను స్టేజీపై నుంచే చురక వేశారు. అందరూ ఒక రూటులో వెళుతుంటే.. వీళ్లిద్దరూ అడ్డదిడ్డంగా వెళుతున్నారంటూ చురక వేస్తూనే..... అలా కొత్తగా ఆలోచిస్తేనే దర్శకుడి సక్సెస్‌ అవుతాడని ముగింపు ఇచ్చాడు. అంటే జాగ్రత్తగా ఉండమని, చెబుతూ... కాస్త విలువలున్న సినిమాలు తీయండని హితవు పలికారు. ఇటీవలే సాహిత్యంపై హైదరాబాద్‌లో చర్చ జరిగింది. దానికోసం కొందరు సాహితీవేత్తలు కూడా వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఫైనల్‌గా తేల్చింది ఏమంటే... విదేశీ సంస్కృతి సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానికి తగినట్లు రచయితలు పాటలురాస్తున్నారు. అలా రాయమని దర్శక నిర్మాతలు చెబుతున్నారంటూ తమ బాధను వ్యక్తం చేశారు.

తపస్సును ఆపను: సిరివెన్నెల
సినీ పాటకు కొత్త ఒరవడి నేర్పి, పాటను ముఖ్యంగా సినీ సాహిత్యాన్ని ప్రేమించేవారికి ఆరాధ్య దైవంగా వెలుగుతున్న వ్యక్తి సిరివెన్నెల అంటూ మొన్ననే సీతారామశాస్త్రిని పలువురు సత్కరించి ప్రశంసించారు. దీనికి ఆయన స్పందిస్తూ... పాటల ద్వారా నా అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. నా గీత రచన ఓ తపస్సు. ఆ తపస్సును ఆపను. రంభ, ఊర్వశి లాంటివారు వచ్చినా తపస్సు ఆగదు అంటూ స్పందించారు. దీనికి సినీ గీతరచయితలు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు. కొందరైతే తలదించుకుని... తాము తప్పని పరిస్థితుల్లో అటువంటి సినీ సాహిత్యాన్ని రాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రివిక్రమ శ్రీనివాసరావు ఈ విషయపై తీవ్రంగా స్పందించారు.

నిర్మాత లాభాపేక్షే అసలు కారణం: త్రివిక్రమ్‌
ప్రస్తుత కాలంలో దర్శకుల అజ్ఞానం, సినీ నిర్మాత లాభాపేక్ష తదితర కారణాలవల్ల సాహిత్యం చచ్చిపోతోంది. ఆ మహానుభావులను స్మరించుకునేందుకు సినీ పరిశ్రమకు తీరికలేదు. సినీపాట రాస్తూ కూడా సాహిత్యపు విలువలను అద్ది ప్రేక్షకుల స్థాయిని పెంచిన సిరివెన్నెల వంటివారు ఎందరో ఉన్నారు. తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. వారంరదికీ నా కోటి దండాలు అంటూ వివరించారు.

కొలవెరి..ఎందుకు హిట్‌?
ఇటీవలే యావత్‌ ప్రపంచంలో క్రేజ్ సంపాదించిన 'వై దిస్‌ కొలవరి..' అంటూ పాడిన పాటలో గమ్మత్తైన స్వరం.. స్వరాలు అటు యువతను, వృద్ధులను ఆకట్టుకున్నాయి. ఈ పాటకు సంగీతం సమకూర్చిన అనురిధ్‌... రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యకు బంధువు. ఏదిఏమైనా... ఆ పాటకు ట్యూన్‌ కట్టడం. ఆ పాటను హీరో ధనుష్‌ పాడటం విశేషం. అందులో చిన్నపదాలు.. ఆంగ్లం, తెలుగు, తమిళ భాషలు మిళితమైనా.. ఎక్కడా అసభ్యత లేదు.. ఇంకో రహస్యం ఏమిటో. తెలుసా... ఇది గురజాడ సాహిత్యం లోంచి వచ్చిందే.... 'కన్యాశుల్కం'లో గిరీశం డైలాగ్‌లు గుర్తుచేసుకోండి... ఆ పాత్రను పోషించిన ఎన్‌.టి.ఆర్‌.... మూన్‌లైట్‌... గ్రీన్‌ట్రీస్‌.. అంటూ.. కొన్ని పదాలను తెలుగు, ఇంగ్లీషు కలిపి పాడేస్తాడు. అందులోని వచ్చిన పదాలే ఈ 'కొలవెరి...' పాట.

ఇప్పటి తెలుగు సినీ సాహిత్యంపై సీనియర్‌ నిర్మాత తన స్పందన ఇలా వినిపించారు. లెక్చరర్‌ పాఠాలు చెబుతుంటే.. చూడరా టీచర్‌ ఎంత సెక్సీగా ఉందో.. అంటూ రాసిన సంభాషణల్లోంచి... పాటను రాసి... దాన్ని దర్శకుడు చెప్పిన 10 నిముషాల్లో పాట తయారైందని మీడియా ముందు గొప్పలు చెప్పుకుంటున్న గీతరచయితను అయ్యో పాపం అనాలా... బాగా రాశావ్‌ అని మెచ్చుకోవాలో.. అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తెలుగు సినీ సాహిత్యం మారుతుందా..?!!

No comments:

Post a Comment