Thursday, April 7, 2011

నేను వృద్ధురాలిలా కనబడుతున్నానా...?: సిమ్ ప్రశ్న

90ల్లో టాలీవుడ్ కుర్రకారును ఓ ఊపు ఊపిన సెక్సీ తార సిమ్రాన్. మంచి స్టార్‌డమ్ ఉండగానే పెళ్లి చేసుకుంది. సహజంగా వివాహమాడిన నటీమణులు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేయడం, పిల్లాబీరకాయలతో కాలక్షేపం చేయడం జరుగుతుంటుంది. కానీ సినిమాలపై మోజు తీరనివారు మాత్రం తిరిగి మళ్లీ సినిమాలవైపుకే వస్తారు. అరిచే గొంతు.. ఎగిరే కాలు ఊరుకోదన్నట్లు సిన్మాల్లో ఒక్కసారి ముఖానికి రంగేసుకున్నాక అదే రంగును మళ్లీమళ్లీ వేసుకోవాలనుకుంటూనే ఉంటారు. అందుకే సిమ్రాన్ తిరిగి చెన్నైకి వచ్చేయడమే కాక తనకు తెలిసిన నిర్మాతలకు నేనెచ్చానోచ్ అంటూ కబురంపింది.

ఛాన్సులేమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కూడా అభ్యర్థించినట్లు భోగట్టా. అయితే సదరు నిర్మాతలందరూ సిమ్రాన్‌కు "అమ్మ" పాత్రలను ఆఫర్ చేశారట. దీనిపై సిమ్ మండిపడిందట. తానేమన్నా వృద్ధురాలిలా కనబడుతున్నానా..? అని ప్రశ్నించిందిట. అయినా తను అలాంటి పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు చూసేందుకు సిద్ధంగా లేరని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట ఈ బక్కపలచని భామ.

సినీ నిర్మాతల వరస చూసిన సిమ్రాన్ ఏకంగా తనే నిర్మాత అవతారం ఎత్తేందుకు కంకణం కట్టుకున్నదట. ముందుగా బుల్లితెర నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని యోచన చేస్తున్నట్లు భోగట్టా.

No comments:

Post a Comment