Friday, April 8, 2011

రాజీపడివుంటే సోనియా సరసన కూర్చొనేవాడిని: జగన్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో తాను రాజీపడివుంటే ఈ ఉప ఎన్నికలు వచ్చే ఉండేవి కావని, కేంద్ర మంత్రి హోదాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సరసన కూర్చొని ఉండేవాడినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన కడప లోక్‌సభ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాన్న నేర్పిన నైతిక విలువలను వదిలేసి ఉంటే ఈరోజు ఉప ఎన్నికలు వచ్చేవి కావేమోనని అన్నారు. సచ్ఛీలత, విశ్వసనీయతను తాను పక్కనపెట్టి రాజీపడుంటే తనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పక్కన కూర్చోబెట్టుకుని ఉండేవారన్నారు. వైఎస్‌ఆర్ పెంపకంలో రాజీపడటం తాను నేర్చుకోలేదని జగన్ అన్నారు. అందుకే ఈ ఎన్నికలను అహంకారానికి, అభిమానానికి జరుగుతున్న ఎన్నికల పోరుగా అభివర్ణించినట్టు చెప్పారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఒకప్పుడు ఇండియన్ కాంగ్రెస్‌లో ఇందిరా కాంగ్రెస్‌గా మారి, సోనియా వచ్చాక ఇటాలియన్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ కాంగ్రెస్‌తో తాను విభేదించి బయటకు వచ్చినట్టు తెలిపారు.

No comments:

Post a Comment