Saturday, December 3, 2011

ఛాన్స్‌ల కోసం హీరోయిన్ ఏం చేస్తుంది.. అదే 'ది డర్టీ పిక్చర్'

నటీనటులు: విద్యాబాలన్‌, నసీరుద్దీన్‌షా, ఇమ్రాన్‌ హష్మీ, తుషార్‌కపూర్‌ తదితరులు
కెమెరా: బబ్బీసింగ్‌,..............నిర్మాతలు: శోభాకపూర్‌, ఏక్తాకపూర్‌,
దర్శకత్వం: మిలన్‌ లూద్రియా.

ఈ చిత్రకథ అందరికీ తెలిసిందే.. సిల్క్‌స్మిత జీవిత చరిత్రను సినిమా తీయడం. సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవాలి. అవసరమైతే బ్లూఫిలింలో కూడా నటించాల్సి వస్తుందనేది ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాకపోయినా... సిల్క్‌స్మితను టార్గెట్‌గా నార్త్‌ ఇండియా ఇండస్ట్రీ చేయడం విశేషం.

ఆమె కాదు.. నార్త్‌ హీరోయిన్లు ఫర్వీన్‌బీబీ, దివ్యభారతి వంటి జీవితాలు కూడా అనుమానాస్పదంగా ముగిశాయి. వారి జీవితాలను టచ్‌ చేయకుండా కేవలం సిల్క్‌స్మితను టార్గెట్‌ చేయడం ఎంత వరకు సమంజసం అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో పై వారిద్దరికి సంబంధించిన సన్నివేశాలు గుర్తుకువస్తాయి.

హైలైట్‌ ఏమంటే... దక్షిణాది సూపర్‌స్టార్‌తో సిల్క్‌స్మిత (అసలు పేరు విజయలక్ష్మి) చాలా సన్నిహిత సంబంధాలుండేవని చర్చించారు. అతని పేరు సూర్యకాంత్‌ కూడా పెట్టారు. ఆ పాత్ర రజనీకాంత్‌ అయివుంటుందని సినిమా చూసినవాడికి ఇట్టే తెలిసిపోతుంది. రజనీలో ఇంత టాలెంట్‌ ఉందా? అనిపించకమానదు.

మంచితో పాటు ఆయనలో మరో కోణం కూడా ఉందని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తుండేవి. ఈ చిత్రం విడుదల తర్వాత దాన్ని నిజం చేసినట్లయింది. సిల్క్‌స్మిత పాత్రను విద్యాబాలన్‌ పోషించడం ఆ హీరో పాత్రను నసీరుద్దీన్‌షా పోటించడం చిత్రానికి ఒక హైప్‌ తెచ్చాయి.

కథలోకి వెళితే.... విలేజ్‌‌లో ఉండే రేష్మాకు సినిమాలంటే పిచ్చి. అప్పటి స్మాషింగ్‌ హీరో సూర్యకాంత్‌ (నసీరుద్దీన్‌షా) అంటే వల్లమాలిన అభిమానం. ఎలాగైనా నటి కావాలని ఒక రోజు ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయి మద్రాసు చేరుతుంది. సినిమాలో ఛాన్స్‌ కోసం ప్రయత్నాలు ఆరంభిస్తుంది. ఆఖరికి నృత్యబృందంలో స్థానం సంపాదిస్తుంది. డాన్స్‌లోని ఓ మూమెంట్‌లో రేష్మా చూపిన సెక్సీ ఫీలింగ్స్‌ ఆడియన్స్‌కు నచ్చి విజయాన్ని చేకూర్చి పెడతాయి.

ఇది చూసిన ఓ నిర్మాత తనతో సినిమా తీయడానికి ముందుకువస్తాడు. వచ్చిన వాడు ఆమె అభిమాన హీరో సూర్యకాంత్‌తో అవకాశం కల్పిస్తాడు. ఆయన పరిచయంతో పేరు మారుమోగుతుంది. సూర్యకాంత్‌ స్వార్థం కోసం ఆమెను ఉపయోగించుకుంటాడు. ఆయనకు ఓ తమ్ముడు రమాకాంత్‌ (తుషార్‌కపూర్‌) ఉంటాడు. అతనికీ ఆమె దగ్గరవుతుంది.

ఇది తట్టుకోలేని సూర్యకాంత్‌ ఆమెకు సినిమా ఛాన్స్‌లు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో రేష్మా తన మనసుకు ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తుంది. ఓ సందర్భంలో బ్లూఫిల్మ్‌లో నటిచండానికి సిద్ధమవుతోంది. దీంతో ఆమె కుటుంబంలోని వారి ప్రవర్తన ఎలా ఉంది? వయస్సుతో పాటు కెరీర్‌ పోయిన విద్యాబాలన్‌ ఏం చేసింది? అసలు సిల్క్‌స్మిత కథ నిజమేనా? అని తెలుసుకోవాలంటే మిగిలిన ఎపిసోడ్‌చూడాలి.

సిల్మ్‌స్మిత చిత్రమంటే ఏం చూపిస్తారు.. ఎలా ఉంటుంది. అనే ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేశారు కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ బాగానే ఉన్నాయి. మాస్‌, యూత్‌ను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి సినిమా తీసి ఇలా క్యాష్‌ చేసుకోవడం ఆమె కుటుంబీలకు నచ్చలేదు. కోర్టు వరకు వెళ్ళింది. చివర్లో కోర్టు క్లియర్‌ చేసింది కూడా.

సిల్క్‌స్మిత దేశానికి ఏం చేసిందనేదికాదు. ఆమె తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అందుకే సినిమా తీశామని నిర్మాతలు చెబుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది.. సినిమా రంగం ఏ భాష అయినా హీరోయిన్‌ ఛాన్స్‌ కావాలంటే ఏం చేస్తారని.. ఏంచేయాల్సి వస్తుంది అనేది పబ్లిక్‌గా చెప్పడమే విశేషం. దీనికి సెన్సార్‌ నుంచి అభ్యంతరాలులేవు.

కథ ప్రకారం విద్యాబాలన్‌ నటనను బాగా పండించింది. సన్నివేశాలపరంగా డీగ్లామర్‌, గ్లామర్‌తో, సెక్సీసీన్స్‌తో ఆకట్టుకుంది. సూర్యకాంత్‌తో బెడ్‌రూమ్‌ సీన్‌, బాత్‌రూమ్‌సీన్స్‌ కూడా చూపించారు. ఆమెకు పోటీగా అప్పుడే వస్తున్న షఖీలా అనే నటితో ఓ పార్టీలో గొడవ పడడం.. ఇలా చాలా సన్నివేశాల్లో ఆమె ఆగ్రహావేశాలు, హావభావాలు కుదిరాయి. వయస్సుపడుతున్న నటుడిగా రమాకాంత్‌ పాత్రలో నసీరుద్దీన్‌షా గెటప్స్‌ బాగా చేశాడు. తుషార్‌ అమాయకంగా కన్పించే ప్రేమికుడిగా కన్పిస్తాడు. సిల్మ్‌స్మిత జీవితంలోనూ ఓ ప్రేముందని చెప్పాడు.

సాంకేతికంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ పనితనం చాలా కన్పించింది. 1980 పీరిడ్‌లో జరిగిన కథ గనుక అప్పటి డిజైనింగ్‌, విక్రమ్‌ గైక్వాడ్‌ మేకప్‌ అలంకరంణ, వస్త్ర అలంకరణ బాగా కుదిరాయి. డాన్స్‌లో ప్రకాష్‌రాజ్‌ భార్య పోనీవర్మ కంపోజ్‌ చేసిన 'ఊలాలా...' పాట ఆకట్టుకుంది. సిల్క్‌స్మిత జీవిత కోణంలో కొత్త కోణాలు కొన్ని తెలియని కప్పిస్తాయి.

ఈ చిత్ర కథ అంతా ఆమె జీవితంలో జరిగిన సన్నివేశాలు టచ్‌ చేయడం మినహా... హృదయానికి హత్తుకునేట్లుగా ఏమీ ఉండవు. కేవలం ఆమెను క్యాష్‌ చేయడం కోసం ఈ చిత్రం తీశారనే చెప్పాలి. పేరే ది దర్టీ పిక్చర్‌ కనుక.. ఇంతకంటే ఈ సినిమా గురించి చెప్పేదేమిలేదు.

No comments:

Post a Comment