Tuesday, February 21, 2012

రొమ్ముల్లో కనిపించే కణుతులున్నీ క్యాన్సర్ గడ్డలు కావు!

రొమ్ములో అసౌకర్యం... చేత్తో తడిమినప్పుడు... చిన్న కణితి ఉందనే భావన.. క్యాన్సర్ భయాన్ని పెంచినా... అది అన్నివేళలా ప్రమాదం కాదు. అలాంటి కణుతులు, ఇన్‌‌ఫెక్షన్లు ఎదురుకావడం కొన్నిసార్లు సహజమని తెలుసుకోవాలి.

ఫైబ్రోఎడినోమా రొమ్ములనేవి క్షీరగ్రంథులు, క్షీరనాళాలతో ఏర్పడతాయి. వీటి చుట్టు కొవ్వు కణజాలం, ఆసరానందించే కణజాలం ఉంటాయి. కొన్నిసార్లు క్షీరగ్రంథులపై మరో కణజాలం పెరిగి గడ్డలా మారుతుంది. ఆ పరిస్థతే ఫైబ్రోఎడినోమా. క్యాన్సర్ కాని ఈ సమస్య సాధారణంగా ఇరవై నుంచి ముఫ్ఫైఏళ్ల యువతుల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. స్త్రీల శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోను మోతాదు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చని కొంతవరకూ రుజువైనది.

సాధారణంగా ఒకటి నుంచి మూడు సెంటీమీటర్లలో రొమ్ము చర్మం అడుగున ఏర్పడే ఈ గడ్డలతో నొప్పి అంతగా ఉండదు. కొన్నిసార్లు ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువుగా ఉండే వాటిని జెయింట్ ఫైబ్రోఎడినోమా అంటారు.

ఇలా నిర్థారణ : రొమ్మును చేత్తితో తడిమినప్పుడు గడ్డ కదులుతున్నట్లు (బ్రెస్ట్ మౌస్) అనిపిస్తుంది. ఇవి ఒకే పరిమాణంలో ఉన్నా గర్భాధారణ, పాలిచ్చే సమయాల్లో పెరగవచ్చు. క్యాన్సర్ కావచ్చనే భయంతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు పరీక్ష చేయటంతో పాటు మామోగ్రామ్ అల్ట్రాసౌండ్ స్కాన్, అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో కోరు నీడిల్ బయాప్సీ (ట్రిపుల్ ఎసెస్‌మెంట్ పరీక్ష)తో సమస్యను నిర్థారిస్తారు.

భయం లేదు: ఫరీక్షల్లో కేవలం ఫైబ్రోఎడినోమా అని తేలితే.... వాటి పరిమాణాన్ని బట్టి తీయాలా వద్దా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ మూడు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పెరిగి, నొప్పీ బాధిస్తోన్నా, ఆ గడ్డను తీసివేయడానికి అత్యాధునిక శస్త్ర చికిత్స (ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ) అందుబాటులో ఉంది. దీన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. చనుమొన దగ్గర చిన్న కోతపెట్టి ఆ గడ్డను తొలిగిస్తారు. అదే సమయంలో ఏర్పడే సొట్టను కనిపించకుండా చేస్తారు. కుట్లు లోపల నుంచి వేయటం వల్ల శస్త్ర చికిత్స తాలూకు మచ్చ కూడా క్రమంగా మాయమవుతుంది. ఆ తరువాత ఎలాంటి సమస్యలు ఉండవు. గడ్డలు అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటే మాత్రం... ఎన్నాళ్లకోసారీ సంప్రదించాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.

కణతులు : రొమ్ముకు ఆసరానందించే కణజాలంలో ఉన్నట్లుండి నీటి కణుతులు ఏర్పడతాయి. వయసు పెరిగే కొద్దీ రొమ్ము ఆకృత్తిలో మార్పు చోటు చేసుకున్నపుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఇది సాధారణంగా మెనోపాజ్ దశకు చేరేకొద్దీ ఇవీ తరచూ ఎదురై... ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. అయితే మెనోపాజ్ అనంతరం హార్మోన్లు (హెచ్‌ఆర్‌టీ) వాడే వారిలో ఇవి మళ్లీ రావచ్చు.

నొప్పి అరుదుగా : ఈ సమస్య ఒక రాత్రిలో ఉన్నట్టుండి మొదలవుతుంది. రొమ్ముపై బాగంలో ఎక్కువుగా ఏర్పడే ఈ కణుతులతో అసౌకర్యమే కాదు.. అరుదుగా నొప్పీ బాధించటం నెలసరికి ముందు కనిపించే లక్షణాలు. ఇవి ఒకటి కన్నా ఎక్కువుగా... ఒక్కోసారీ రెండు రొమ్ముల్లోనూ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు.

గుర్తించవచ్చు : అలాంటి కణుతుల్ని కొందరు తేలిగా గుర్తిస్తే... మరికొందరకి ఈ సమస్య ఉన్నట్లే తెలియదు. కానీ కణితి ఉందనే ఉందనే అనుమానం ఏమాత్రం కలిగినా.... నిర్లక్ష్యం చేయకూడదు. నిపుణుల ఆధ్వర్యంలో ట్రిపుల్ ఎసెస్‌మెంట్ పరీక్ష చేయించుకోవాలి. అయితే అది తొంభైతొమ్మిదిశాతం క్యాన్సర్ కాదు. కణుతుల్లో నీటితోపాటు నెత్తురు కూడా కనిపిస్తేనే అది ఇంట్రాసిస్టిక్ క్యాన్సర్ కావచ్చు. దాన్ని నిర్థారించేందుకు సైటాలజీ పరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్య ఒక్క శాతం మాత్రమే ఎదురవుతుంది.

భయం లేదు : ఇవి సాధారణంగా వాటంతట అవే కరిగిపోతాయి. ఒకవేళ మరీ పెద్దగా ఉండీ, కరగని పక్షంలో అల్ట్రాసౌండ్ స్కాన్ సాయంతో వాటిలోని నీటిని తొలగిస్తారు వైద్యులు. దాంతో కణితి మాయమవుతుంది. అలా తొలగించినవి మళ్లీ మళ్లీ ఏర్పడవచ్చు. కొత్తవి రావచ్చు. చికిత్సానంతరం కొన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

చనుమొనల ఇన్‌‌ఫెక్షన్ : వయసురీత్యా రొమ్ములో సహజసిద్ధంగా చోటుచేసుకునే మార్పు ఇది. మెనోపాజ్ తరవాత చనుమొనలకు పాలను సరఫరా చేసే క్షీరనాళాల ఆకృత్తి తగ్గి, వెడల్పుగా (డక్ట్ ఎక్టేసియా) మారతాయి.

లక్షణాలతో అప్రమత్తం : వెడల్పైన క్షీరనాళాలో అప్పుడపుడు స్రావం చేరి... కొన్నిసార్లు కొందరిలో ఇన్‌ఫెక్షనకు దారీతీస్తుంది. చనుమొన దగ్గర ఎర్రగా కావడం, దద్దుర్లు, దురద వంటివి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. క్షీరనాళాలు చిన్నగా కావడం వల్ల చనుమొనల లోపలకి ఉన్నట్లుగా కనిపిస్తాయి. అటువంటప్పుడు వైద్యల్ని సంప్రదించటం తప్పనిసరి.

ఇన్‌ఫెక్షన్ కారణంగా చనుమొనల నుంచి చిక్కని నీటి రూపంలో ఉండే స్రావం కూడా విడుదల కావచ్చు. అది పారద్శకంగా, తెలుపు, ఆకుపచ్చ, పసుపు గోధుమ రంగుల్లో ఉంటే భయపడకర్లేదు. చనుమొనల వెనుకల గడ్డ ఉండి... దాన్నుంచి నెత్తురు స్రవిస్తుంటే మాత్రం... ఇంట్రా డక్టల్ క్యాన్సర్ కావచ్చు. ట్రిపుల్ ఎసెస్‌మెంట్ పరీక్షతో అసలైన సమస్య తెలుస్తుంది. ఒకవేళ ఇది ఎరుపురంగులో ఉంటే మాత్రం అదనపు పరీక్ష తప్పదు. అవసరాన్ని బట్టి నిపుణులు వెడల్పైన క్షీరనాళాలను తొలగించాలా లేదా అన్నది వైద్యలు నిర్ణయిస్తారు. ఇది వయస్సురీత్యా చోటుచేసుకునే సర్వసాధారణమైన మార్పు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.

No comments:

Post a Comment