Sunday, September 15, 2013

కలెక్షన్ క్వీన్స్..!

కలెక్షన్లు సాధించడంలో 'నాయకులకు' మేం ఏమాత్రం తక్కువ కాదంటున్న కొందరు 'నాయికలు'. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. సినిమాల కలెక్షన్లను బిలియన్ల స్థాయికి చేరుస్తున్నారు కొందరు నటీమణులు. కొందరు
అందంతో ఆకట్టుకుంటారు.. ఇంకొందరు అభినయంతో అదుర్స్ అనిపిస్తారు.. మరికొందరు భారీ కలెక్షన్లతో అదరహో అనిపిస్తారు. ఈ మూడు గుణాల కలబోతగా తెరపై తళుక్కున మెరిసే తారలు కొందరున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేర్లు.. దీపిక పదుకొనె, కరీనా కపూర్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా తదితరులు. వీరు తెరపై కనపడితే చాలు నిర్మాతలకు కాసుల పంటే, ఎలాంటి సినిమా తీసినా అది బిలియన్ క్లబ్ లో చేరిపోవాల్సిందే. వీరిలో ముందు వరుసలో వుంది దీపిక పదుకొనే.
స్పెషల్ లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకోవడం దీపిక స్టయిల్. ఆమె ఇటీవల షారుఖ్ తో కలిసి నటించిన చెన్నయ్ ఎక్స్ ప్రెస్ ఇప్పటికే 214 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు కొల్లగొట్టింది. కెరీర్ మొదట్లో ఎఫైర్ల కారణంగా వార్తల్లో తళుక్కుమన్న దీపిక ఆ తరువాత సినిమాల పరంగా టాప్ స్టార్ అయిపోయింది. ఓం శాంతి ఓం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన దీపికకు 2012 వరకు బిలియన్ భామగా గుర్తింపు రాలేదు. 2013 లో విడుదలైన రేస్ 2 తో దీపిక బిలియన్ ఖాతా తెరిచింది. రేస్ 2 చిత్రం 115 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత రణబీర్ కపూర్ తో కలిసి నటించిన ఏ జవాని హై దివానీ సినిమా 189 కోట్లు వసూలు చేసింది. మరో 11 కోట్లు వసూలు చేసుంటే ఆ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్బులో చేరిపోయుండేది. ఆ తరువాత చెన్నయ్ ఎక్స్ ప్రెస్ కథ తెలిసిందే.
3 ఇడియట్స్ తో కరీనా హవా..
 
ఎఫైర్లతోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకునే అందాల హీరోయిన్ కరీనా కపూర్. 2009 లోనే బిలియన్ భామగా గుర్తింపు సాధించింది. అమీర్ ఖాన్ తో కలిసి నటించిన 3 ఇడియట్స్ చిత్రం విడుదలై 202 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఆ తరువాత సంవత్సరం విడుదలైన గోల్ మాల్ -3 సినిమా కూడా 108 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత ఈమె నటించిన బాడీ గార్డ్ సినిమా 155 కోట్లు
సంపాదించింది. అదే సంవత్సరంలో విడుదలైన మరో సినిమా రా.వన్ సినిమా 114 కోట్లు వసూలు చేసింది.
కుర్రకారుకు కైఫే..!
 
కత్తిలాంటి అందంతో నాజూగ్గా ఉండే మరో తార కత్రినా కైఫ్. ఓర చూపులతో కుర్రాళ్ల మతిపోగొట్టడంలో కత్రినా తీరే వేరు. 2012లోనే బిలియన్ భామగా గుర్తింపు సాధించింది. ఆ సంవత్సరం విడుదలైన ఏక్ థా టైగర్ సినిమా 198 కోట్లు వసూలు చేసి ఆమెకు బిలియన్ భామ ట్యాగ్ ను సొంతం చేసింది. ఆ తరువాత జబ్ తక్ హై జాన్ సినిమా 123 కోట్లు వసూలు చేసి బిలియన్ క్లబ్ లో ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది.
దబాంగ్ తో సోనాక్షి ఎంట్రీ..
 
ఇక సోనాక్షి సిన్హా విషయానికి వస్తే 2010 లోనే సల్మాన్ ఖాన్ తో నటించిన దబాంగ్ సినిమా 150 కోట్లు వసూలు చేసి బిలియన్ క్లబ్ లో ఆమెను జాయిన్ చేసింది. ఫస్ట్ అండ్ ఫస్ట్ గా బిలియన్ క్లబ్ లో సోనాక్షిని మెంబర్ చేసింది. 2012 సంవత్సరం ఆమెకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఆమె నటించిన రౌడీ రాథోడ్ 133 కోట్లు వసూలు చేసింది. తెలుగు విక్రమార్కుడు సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ తరువాత మర్యాద రామన్న రీమేక్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ సినిమా 106 కోట్లు వసూలు చేసి మైండ్ బ్లాక్ చేసింది. ఇక సల్మాన్ తో నటించిన దబాంగ్-2 ఏకంగా 178 కోట్లు వసూలు చేసి అబ్బుర పరిచింది.
నిర్మాతలకు ఎప్పుడూ 'ప్రియ'మే..!
 
ప్రియాంక చోప్రా అంటే బాలీవుడ్ నిర్మాతలకు ఎప్పుడూ ప్రియమే. 2011లోనే ప్రియాంక బిలియన్ క్లబ్ లో చేరిపోయింది. కింగ్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన డాన్-2 సినిమా 114 కోట్లు వసూలు చేసి ప్రియాంకకు బిలియన్ భామగా గుర్తింపు తెచ్చింది. 2012 ప్రియాంక చోప్రాకు మరింత లక్కీ అయింది. ప్రియాంక నటించిన రెండు సినిమాలు వంద కోట్లు వసూలు చేశాయి. అగ్ని పథ్, బర్ఫీ సినిమాలు చెరో 122 కోట్లు వసూలు చేశాయి. ఈ చిత్రాలు మంచినటిగా కూడా ఆమెకు గుర్తింపును తెచ్చాయి.
గజినీతో అసిన్...
 
బాలీవుడ్ భామల్లోకి ముందుగా బిలియన్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అసిన్. సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన అసిన్ గజిని రీమేక్ సినిమాతోనే ఈ రికార్డును సాధించడం విశేషం. అమీర్ ఖాన్ హీరోగా నటించిన గజిని చిత్రం 115 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ను బిలియన్ క్లబ్ వైపు చూసేలా చేసింది. అసిన్, సల్మాన్ కలిసి చేసిన రెడీ సినిమా 130 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత 2012లో ఆమె నటించిన హౌస్ ఫుల్-2 సినిమా 112 కోట్లు, బోల్ బచ్చన్ సినిమా 104 కోట్లు వసూలు చేసి వారేవా అసిన్ అనిపించాయి.
టాలివుడ్ చందమామ కూడా...
 
కాజల్ కూడా బిలియన్ క్లబ్ లో మెంబర్ షిప్ సాధించింది. అజయ్ దేవగన్ నటించిన సింగం సినిమాలో కాజల్ నటించింది. ఈ సినిమా 2011లో విడుదలై 100 కోట్లు వసూలు చేసి, కాజల్ ను బిలియన్ భామగా మార్చింది. బిలియన్ భామగా ఇటీవల ఓ కొత్త హీరోయిన్ గుర్తింపు పొందింది. ఆమే.. సోనమ్ కపూర్. ఈ అమ్మడు నటించిన భాగ్ మిల్కా భాగ్ 104 కోట్లు వసూలు చేసింది.
ఇలా... గత నాలుగేళ్ళలో హిందీ చిత్రపరిశ్రమకు వందల కోట్లు ఆర్జించిపెట్టిన హీరోయిన్లు, రాబోయే కాలంలో మరెన్ని కోట్లు చిత్ర పరిశ్రమకు సంపాదించిపెడతారో చూడాలిమరి. ఏమైనా చిత్ర నిర్మాణం తలకుమించిన భారమని వాపోతున్న నిర్మాతలు.. ఇలా కోట్లు తెచ్చే హీరోయిన్లతో ఖుషీఖుషీగా వుంటారని ఆశిద్దాం.

No comments:

Post a Comment