మృదువైన జుట్టుకు అరటిపండు
అరటిపండ్లలో పొటాషియం స్థాయి ఎక్కువ ఉండటం వలన జుట్టుని సహజంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండును ఫోర్క్‌తో గిన్నెలో గుజ్జుగా చేయాలి. అలా గుజ్జుగా చేసిన అరటిపండును జుట్టు కుదుళ్ళకు పట్టించి, 15 నిమిషాల వరకూ వదిలేయాలి. తర్వాత షాంపూ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చిట్లిన జుట్టు కుదుళ్ళు మృదువుగా అవుతాయి.
గుడ్డు సొనతో చికిత్స
గుడ్డులోని పచ్చసొనలో 3 చుక్కల ఇ విటమిన్, ఒక చెమ్చా ఆలివ్ నూనె వేసి కలిపి, ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, 10 నిమిషాల పాటు ఉంచి షాంపూ చేయాలి. ఇది జుట్టును మృదువు చేస్తుంది. జుట్టుకి మంచి కండిషనర్‌లా ఉపయోగ పడుతుంది. ఇదే విధంగా వారానికి ఒకసారి చేస్తూంటే ఫలితం కన్పిస్తుంది.
నూనెతో మర్దన
గోరువెచ్చని నూనెతో తల మీద మర్దన చేసే చికిత్స అందరికీ తెలిసిందే. దానికి కొబ్బరినూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ వాడితే మంచిది. తలలో చుండ్రు ఉంటే గోరువెచ్చని నూనెలో నిమ్మరసం, వెనిగర్ కలిపి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. ఇంకా మంచి ఫలితం రావాలంటే, నిద్ర పోవడానికి ముందు జుట్టుకు ఆలివ్ ఆయిల్ పట్టించి, రాత్రంతా వదిలేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. వెంట్రుకలు దృఢంగా, చిట్లిపోకుండా ఉంటాయి.
ఉసిరి పొడి, నిమ్మరసం మిశ్రమం
ఒక స్పూన్ ఉసిరి పొడి, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకు నెమ్మదిగా మర్దన చేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంలో ఒకసారి ఇలా చేస్తే పట్టుకుచ్చులాంటి జుట్టు మీ సొంతం.
సోంపు గింజలతో...
రెండు స్పూన్‌ల సోంప్ గింజల్ని రాత్రంతా నానపెట్టి, ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. చుండ్రు నివారణకు ఇది పనిచేస్తుంది.
ఆహారం, వ్యాయామం
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన జుట్టు తీరు ఆధారపడి ఉంటుంది. పండ్లు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్లున్న ఆహారం తీసుకోవాలి.
మంచినీళ్ళు ఎక్కువగా తాగడంతో పాటు వ్యాయామం, విశ్రాంతి కూడా అవసరం. అలా చేయడం వెంట్రుకలను అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు దృఢంగా, త్వరగా పెరుగుతాయి.

No comments:
Post a Comment