Wednesday, November 13, 2013

జలుబు,దగ్గు చేసినప్పుడు పిల్లలకు తేనె ముఖ్యం...

జలుబు చేసినప్పుడు పిల్లలు రాత్రిపూట ఒకటే దగ్గుతుంటారు. పిల్లలేంటి మనం కూడా దగ్గుతుంటాం. అయితే పిల్లలు దగ్గుతో నిద్రలేమి కలిగి చాలా చిరాకు చేస్తారు. దీంతో పెద్దవాళ్లు వెంటనే ఏదో ఒక
దగ్గు మందు పోసేస్తారు. దగ్గు మందులు అలా ఇష్టానుసారం వాడటం మంచిది కాదు. కానీ ఇలాంటి సమయంలో పిల్లలకు దగ్గు మందుకన్నా తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చే దగ్గు సహజంగా కొన్నిరోజులకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ తల్లితండ్రులు దగ్గు మొదలవడం ఆలస్యం ఏదో ఒక దగ్గు మందో లేదా అంతకుముందు డాక్టర్‌ రాసిచ్చిన దగ్గు మందునే మళ్లీ కొని తెచ్చి, వేసేస్తారు. ఈ మందులు ఎక్కువ మోతాదులో వాడితే ప్రమాదకరం కూడా! అయితే ఇక ఈ దగ్గు మందుల్ని మానుకుని తేనె ఉపయోగించడం సురక్షితం, శ్రేయస్కరం. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్‌ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే నోటిలో లాలాజలం ఊరటానికి దోహదం చేయడంతో పాటు తేనెలోని చిక్కదనం కూడా ఇందుకు దోహదం చేస్తోందని వారు వివరించారు.

No comments:

Post a Comment