Monday, April 7, 2014

శ్రీరామ నవమిన పానకం-వడపప్పు ఎందుకు తినాలి?

శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని
సకల సముద్రాలు దాటించగలదు. రాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి. తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి. హరికథలు... బుర్రకథలు... పాటలు... శ్రీరామ నీ నామమెంతో రుచిరా...పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు. పానకం - వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? శ్రీరామ నవమి రోజున అందరిల్లలోనూ పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభివూపాయం. సీతారాముల కళ్యాణోత్సవం నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
1. పానకం కావలసిన పదార్ధాలు : బెల్లం : రెండు కప్పులు, మంచి నీళ్ళు : ఆరు కప్పులు, మిరియాల పొడి : రెండు టీ స్పూన్లు, ఉప్పు : చిటికెడు, శొంటిపొడి : టీ స్పూన్, నిమ్మరసం : రెండు టీ స్పూన్లు, (కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు), యాలుకల పొడి : టీ స్పూన్ 
తయారుచేయు విధానం : 
1) బెల్లం మెత్తగా కొట్టి, నీళ్ళలో కలపాలి. 
2) బెల్లం మొత్తం కరిగాక, పలుచని క్లాత్ లో వడకట్టాలి. (టీ ఫిల్టర్ తో వడపోయ్యోచ్చు).
3) ఇప్పుడు దీనిలో మిరియాలపొడి, శొంటి పొడి, ఉప్పు, యాలుకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. 2. వడపప్పు: కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, కీరా - ఒక ముక్క, పచ్చిమిర్చి - 1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత తయారు చేయు విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి.

No comments:

Post a Comment